శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ..!
యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్ క్వచిత్....
మహా భారతం గురించి ప్రాచుర్యం పొందిన మాట ఇది. ఇందులో ఉన్న విషయాలు ప్రపంచంలో వున్నాయి.. ఇందులో లేని విషయాలు ఎక్కడా లేవు అని దీనర్థము. అలాంటి మహాభారతానికి మూలస్తంభం లాంటిది కృష్ణుని పాత్ర.
నేను మెడిసిన్ లో చేరిన కొత్తలో చిన్నపాటి రాగింగ్ అయింది. సీనియర్లు "నీకు ఏ దేవుడంటే ఇష్తం.. రాముడా కృష్ణుడా " అని అడిగారు. కృష్ణుడు అని చెప్పాను. వాళ్ళు నవ్వడం మొదలు పెట్టారు.. చాలా మంది భార్యలున్న కృష్ణుడు ఎందుకు నచ్చాడు.. అని అడిగారు. నాకు విపరీతమైన కోపం వచ్చింది. ఒక చిన్న సైజు ప్రసంగమొకటి చేసాను. అ తర్వాత నన్ను వాళ్ళు ఇంకేమీ అడగలేదు...
ఆ మాటల సారాంశం :
కృష్ణుడు ఒక తత్వవేత్త. ఒక కర్మ వాది. వ్యక్తిత్వ వికాస గ్రంధాలలో ఎన్ని యుగాలైనా ముందు వుండేది భగవద్గీత. ఒక నాయకుడు ఎలా ఉండాలో, ఎలాంటి ప్రణాళికలు విజయానికి మార్గం చూపిస్తాయో చెప్పాడు. చిన్నప్పటి నుంచి కష్టాలకు ఎదురు నిలిచాడు. చెరసాలలో పుట్టాడు. వర్షపు రాత్రి నదిని దాటుకుని యశోద వద్దకు చేరాడు. తనను చంపడానికి వచ్చిన పూతనను, శకటాసురుడిని.. ఇలా అనేక మంది రాక్షసులిని అంతమొందించాడు. గోవర్ధన గిరిని పైకెత్తి ఇంద్రుని అహంకారం నుంచి యాదవులనందరినీ రక్షించాడు. కాళీయ సర్పాన్ని నియంత్రించాడు. ఇలా ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతూ కర్తవ్య దీక్షలో వున్నాడు. తనపై పడిన నీలాప నిందలను సమర్ధంగా ఎదుర్కొన్నాడు. తనను విమర్శించిన వారే పూజించేలా విజయాలను సాధించాడు.
పాండవుల తరపున రాయబారం చేసి కురుక్షేత్ర సంగ్రామం ఆపు చేయడానికి ప్రయత్నిచాడు. మూర్ఖులైన కౌరవులు తనని బంధించడానికి ప్రయత్నిస్తే, విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. కురుక్షేత్ర సంగ్రామ ప్రారంభంలో విషాదానికి, ఆందోళనకు లోనైన అర్జునినికి కర్తవ్య బోధ చేసి భగవద్గీత రూపంలో ఆ కౌన్సెలింగ్ అంతా సమస్త మానవాళికి అందించాడు. ఏ సమస్యనైనా ఎదుర్కునే ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని తనకు భగవద్గీత ఇస్తుందని మహాత్మా గాంధీ పలు సార్లు చెప్పారు. వివేకానంద స్వామి కూడా చాలా సందర్భాలలో భగవద్గీతను ఉదహరిస్తారు. స్తిత ప్రజ్ఞత , నిర్ణయాధికారం, కర్తవ్య దీక్ష , మనో విశ్లేషణ ... ఇలా ఎన్ని గుణాలను చెప్పుకున్నా అన్నీ పరిపూర్ణం గా ఆచరించి చూపిన అవతార పురుషుడు. భారత యుద్దంలో అభిమన్యుడు మరణించి అందరూ దుఖిస్తుంటే కూడా , కర్తవ్య దీక్షను.. మరునాడు ఆచరించవలసిన యుద్ద వ్యూహాన్ని ప్రణాళిక చేస్తూ.. మానసిక స్పందనలు, బాధలు కర్తవ్య దీక్ష నుంచి దారి మరల్చకూడదని బోధించాడు. కేవలం ఏడు అక్షౌహుణి ల (1.53 millions approx) సైన్యంతో పదకొండు అక్షౌహుణి ల (2.4 millions approx) సైన్యాన్నిజయించ గలగడానికి ఆ నిర్ణయాధికారము... ప్రణాళిక కారణం. అదే స్తిత ప్రజ్ఞతను తన నిర్యాణం సమయంలోనూ చూపించాడు.
గీతా మకరందం సమస్త మానవాళికి ఆ భగవంతుడు అందించిన గొప్ప వరం.
శ్రీకృష్ణావతారం నుంచి అరుదైన కొన్ని అద్భుత దృశ్యాలు : గీతోపదేశం , శ్రీకృష్ణ నిర్యాణం.
గీతోపదేశం :
శ్రీకృష్ణ నిర్యాణం:
No comments:
Post a Comment