Showing posts with label తెలుగు. Show all posts
Showing posts with label తెలుగు. Show all posts

Thursday, July 9, 2009

"ప్రేమ" ..!


చిన్న కాగితం మీద నేను చాలా రోజుల క్రితం ఎప్పుడో రాసి దాచుకొన్నది . ఇప్పుడు చదువుతుంటే.. కొంచెం (చాలా ?) అపరిపక్వంగా వుంది. కాని ఇక్కడి పాఠకులతో పంచుకోవడానికి.

"ప్రేమ" ..!

"ప్రవేశము లేదు " అనే అక్షరాలని
అడ్డంగా వుంచుకుని హాయిగా
స్పందిస్తోన్న నా హృదయంలోకి
ఎలాగో చొచ్చుకు వచ్చి
"నన్నెవ్వరూ ఆపలేరు" అంటూ
స్మితహాసం చేసావు.
నిజమే కాబోలు...
జ్ఞాపకాల జ్ఞాపికలనూ
స్మితహాసాల స్మృతి ముద్రలనూ
మధురానుభూతుల సుస్పందనలనూ
నాకు మి..గి..ల్చి..
నా హృదయం ఆర్తిగా పిలుస్తున్నా
వినకుండా
నువ్వు నిర్గమిస్తుంటే
ఆపలేక పోయాను...
నిజమే..
నిన్నెవ్వరూ ఆపలేరు...! "




Friday, July 3, 2009

మందార మకరందాలు

" మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునే ? మదనములకు
నిర్మల మందాకినీ వీచికల దూగు

రాయంచ చనునే ? తరంగిణులకు
లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు

కోయిల సేరునే ? కుటజములకు
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక

మరుగునే ? సాంద్ర నీహారములకు "
అని పోతనగారు భాగవతంలో చెప్పారు. ( అంటే : మందార మకరందాల తీపి చూసిన తుమ్మెద వుమ్మెత్త పూలను చేరుతుందా. ఆకాశ గంగా తరంగాలలో ఉయలులూగిన రాజహంస వాగులకూ వంకలకూ వెళ్తుందా ? తీయని మామిడి లేత చివుళ్ళను తిని పరవశించే కోయిల కొండ మల్లెలను కోరుతుందా ? పండు వెన్నెల బయళ్ళలో విహరించే చకోరం మంచు పొగలవైపు వెళ్తుందా ? " )
అలాగ :
"అంబుజోదర దివ్య పాదారవింద
చింత నామృత పాన విశేష మత్త
చిత్త మేరీతి నితరంబు జేర నేర్చు ?
"
అంటాడు. (భగవంతుని పాదాలను పూజించడంలో ఆనందాన్ని పొందే చిత్తానికి మరో ఆలోచన ఉంటుందా ? అని ఉపమానం. )
భగవంతునిపై మనసు ఉంచితే కలిగే ఆనందం ముందు మిగిలిన భౌతిక విషయాలన్నీ అల్పములని చెప్పడానికి పోతన అనుసరించిన శైలి అద్భుతం. తెలుగు వారి గుండెల్లో ఈ పద్యం చిరస్మరణీయంగా నిలిచి పోతుంది.